- పచ్చి బంగాళాదుంపను తరిగి దానికి కొంచెం నిమ్మరసం, ఓట్మీల్ పొడి,పాలు,పుల్లర్స్ ఎర్త్ లను కలిపి ముఖానికి రాసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.
- దోసకాయ రసంతో ముఖం శుభ్రం చేసుకుంటే యాస్ట్రింజెంట్‌లా పని చేస్తుంది.
- బాదం పప్పు పొడి, ఓట్మీల్ పొడి, పాలు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా వస్తుది.
- ముఖాన్ని మృదువుగా ఉంచేందుకు ఉపయోగపడే స్క్రబ్ తయారి : పెసరపండి, బియ్యప్పిండి, ఎర్రకందిపప్పు, గోధుమలు కొంచెం బరకగా పిండి పట్టించి అందులో ఓట్మీల్ పౌడరు, నారింజతొక్కల పొడి కలిపి నిల్వ చేసి పెట్టుకోవాలి. ఈ పొడి ఒక స్పూను తీసుకుని దాంట్లో పాలమీద మీగడకానీ, మాయిశ్చరైజింగ్ క్రీమ్ కానీ కలిపి దాంతో ముఖం అంతా మర్దన చేసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది.
- క్యారెట్ రసంలో కొంత గోదుమ పిండి కలిపి ముఖానికి పూసుకుని 5 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం అందంగా, మృదువుగా తయారవుతుంది.
- పొట్లకాయ రసంలో, టమోటా రసం కలిపి ముఖానికి పట్టించి 5 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం కాంతివంతంగా, తేజోవంతంగా మెరుస్తుంది.
- ఓట్స్, పాలు, బాదం పాలు, పన్నీర్ కలిపి ముఖానికి పూసుకుని రెండు నిముషాల తర్వాత కడిగేస్తే ముఖం మెరుస్తుంది.
- చర్మం పొడిబారిపోతుంటే రోజూ రాత్రి పడుకోబోయే ముందు ఏదైనా మంచి మాయిశ్చరైజింగ్ లోషన్ రాసుకోవాలి. స్నానానికి ముందు పాలమీద మీగడ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ రాసుకుని తర్వాత సబ్బుతో కాకుండా గోధుమపిండితో స్నానం చేస్తే చర్మం తొందరగా పొడిబారకుండా ఉంటుంది.
- బాదంపప్పు నానబెట్టి వాటిపైన తొక్కుతీసి దానిలో కొంచెం గసగసాల పొడి, రెండు మూడు చుక్కల చందనతైలం, పాల మీద మీగడ కలిపి పేస్ట్ లాగా తయారుచేసుకుని పెట్టుకోవాలి. వారానికి కనీసం రెండుసార్లు అయినా ఇది రాసుకుంటూ ఉంటే చర్మం తేమగా, కాంతివంతంగా మెరుస్తుంది.
- పెసర పిండిలో చందనం కలిపి రాత్రి పూట పడుకోబోయే ముందు ముఖానికి పూసుకుంటూ వస్తే ముఖం మీద నల్లటి మచ్చలు మటుమాయమవుతాయి.
- బాదం పప్పు, పిస్తా పప్పు, జీడి పప్పు, కొంత గసగసాలు ఒకటిగా నూరి, కొంత తేనె, పాలు కలిపి సేవిస్తూ ఉంటే శరీరం కాంతివంతంగా మారుతుంది. ముఖంలో తేజస్సు కనిపిస్తుంది.
- ఆపిల్‌ను వేడినీటిలో వేసి తొలు తీసి జూస్‌లా చేసి చర్మానికి పట్టిస్తే వస్తే చర్మం మెరిసిపోతుంది.
- పుదీనా, వేపాకు, తులసి ఆకులను సమ పాలలో తీసుకుని నూరి ముఖానికి పట్టిస్తూ వస్తే మొటిమలు రావు.
- బాగా పండిన అరటి పండు తొక్కకు అంటి ఉన్న గుజ్జును రోజూ పులిపిర్లకు రాస్తూ ఉంటే కొంత వరకు తగ్గే అవకాశం ఉంది.
- పుదీనా ఆకులు నూరి రాత్రిపూట ముఖానికి రాసుకుని పొద్దుటే గోరువెచ్చటి నీటితో కడుక్కుంటూ ఉంటే మొటిమలు, మచ్చలు త్వరలోనే తగ్గిపోతాయి.
- రోజూ నాలుగైదు సార్లు ముఖం శుభ్రంగా కడుక్కుంటూ యాస్ట్రిజెంట్తో ముఖం తుడుచుకుంటే మొటిమలు త్వరలోనే మాయం
Wednesday, 1 April 2009
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఫేసియల్
జుట్టుకు, తలకు సంబంధించి కొన్ని చిట్కాలు
2. వెంట్రుకలు తెల్లబడకుండా ఉండాలంటే ఉసిరికాయ రసం, నువ్వుల నూనె సమపాళ్ళలో కలిపి, కాచి తలకు రాసుకోవాలి.
3. ఒక కోడిగుడ్డులోని సొనను చిన్న గిన్నెలో వేసి బాగా చిలకరించి అందులో ఒక నిమ్మపండు రసం కలపండి. నాలుగు చెంచాల పెరుగును కూడా ఈ సొనకు కలిపి తలకు పట్టించి అరగంటసేపు వుండండి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే మీ వెంట్రుకలు మృదువుగా, కాంతివంతంగా వుంటాయి.
4. కొబ్బరినూనెలో వెల్లుల్లిపాయలను ఉడికించి, వడకట్టి ప్రతిరోజూ తలకు రాస్తే తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి
5. ఉసిరి పొడిని ఇనప పాత్రలో రాత్రిపూట నానవేసి ఉదయాన్నే ఆ మిశ్రమాన్ని బ్రష్‌తో వెంట్రుకలకు పట్టించండి. అనంతరం తలకు షవర్ క్యాప్ పెట్టుకోవడం వల్ల మిశ్రమం ఒంటి మీద పడదు. గంట తర్వాత స్నానం చేస్తే సరి.
6. ఎండలో బయటకి వెళ్ళినపుడు సన్‌స్క్రీన్‌ని చర్మ సంరక్షణ కోసం వాడుతుంటారు. అలాగే ఎక్కువ సేపు ఎండలో తిరగాల్సి ఉన్నప్పు డు సన్‌స్క్రీన్ ఉన్న జుట్టు ఉత్పత్తులను వాడవచ్చు.
7.ఎక్కువగా జుట్టు రాలుతోందా ఒక ఉల్లిపాయను మెత్తగా పేస్టులా చేసుకోవాలి. దానికి చెంచాడు తేనె కలపాలి. తలకు పట్టించి గంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
8. ఒక కప్పు దంపుడు బియ్యానికి మూడు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. అన్నం ఉడికిన తర్వాత బియ్యాన్ని విడిగా తీయగా వచ్చిన గంజిని చల్లారబెట్టాలి. ఈ గంజిని ఆరంగ ఆరంగా కనీసం మూడుసార్లు జుట్టుకు పట్టించాలి. తర్వాత చల్లని నీటితో శిరోజాలను శుభ్రపరుచుకోవాలి. ఇది జొన్న పీచులా పలుచగా ఉండే జుట్టును ఒత్తుగా చేస్తుంది.
9. ఒక్కోసారి తలంతా దురద పుడుతుంది. అలాగని ఊరికే గోకుతుంటే మాడు పుండు పడుతుంది తప్ప దురద మానదు. ఇందుకు బీట్ రూట్ రసం మంచి చికిత్స. అందుకు ఏం చేయాలంటే తాజా బీట్ రూట్‌ను చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో చిక్కటి రసం తీయాలి. దీనిని నేరుగా తలకు పట్టించుకోవాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి. జుట్టు పట్టులా మెరుస్తుంది.
10. కొంతమంది జుట్టు జిడ్డుగా, నూనె కారుతూ ఉంటుంది. తలస్నానం చేసిన కొద్దిసేపటికే జుట్టు జిడ్డుగా తయారై రాలిపోతుంటుంది. ఇటువంటివారు ఒకవేళ కండీషనర్ వాడదలుచుకుంటే పెరుగును మాత్రం వాడుకోవాలి. కండీషనర్‌ను తలకు కాకుండా వెంట్రుకల కొసలకు ప్రయోగించాలి. స్నానానికి ఉపయోగించే నీళ్లకు కొద్దిగా నిమ్మరసాన్ని చేర్చితే జిడ్డు వదులుతుంది.
11. శీకాకాయ, పెసలు, ఉసిరి, కరివేపాకు, నిమ్మతొక్కలు, మెంతులు వీటిన్నిటిని గాలికి ఆరబెట్టి, ఎండిపోసిన తరువాత విడివిడిగా పొడిచేసుకొని ఒకటిగా కలిపి తలస్నానచూర్ణంగా వాడుకుంటే తలకు పట్టిన జిడ్డు వదిలిపోయి కేశాలు ప్రకాశవంతంగా తయారవుతాయి.
12. జుట్టు ఆరోగ్యవంతంగా పెరగాలంటే మంచి పోషకాహరం తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పొడవాటి జుట్టుని ఇష్టపడేవారు, జుట్టు మరింత పొడవు అయితే బాగుండు అనుకునేవారు, ప్రొటీన్లు ఎక్కువ ఉన్న ఆహరం తీసుకోవాలి. పప్పు, మజ్జిగ, గుడ్లు, పప్పు ధాన్యాలు, చికెన్, పన్నీర్ ఇవన్నీ జుట్టు పెరిగేందుకు కావలసిన పోషకాలు అందిస్తాయి.
13. జుట్టుకి మంచి షాంపూ, కండీషనర్లు రాస్తూ శ్రద్ద తీసుకుంటున్నా చుండ్రు, జుట్టు ఊడిపోవటం మొదలైన సమస్యలు వెంటాడుతుంటాయి కొంతమందిని. వీరు గుర్తించాల్సింది ఏమిటంటే జుట్టు సంరక్షణ అంటే షాంపూ కండీషనర్ల వాడకమే కాదు. మంచి సమతులాహారం తీసుకోవాలి.
14. తడిగా ఉన్న జుట్టును దువ్వటం వల్ల జుట్టు పగిలిపోయి పీచులాగా తయారవుతుంది. దీనివల్ల జుట్టు కుదుళ్ళు కూడా దెబ్బతింటాయి. ఆరిన తరువాత చిక్కు తీసుకోవటం వల్ల సులువుగా వస్తుంది. జుట్టు ఆరోగ్యానికి ఎలాంటి చిక్కూరాదు.
15. పేలు మిమ్మల్ని చికాకు పెడుతున్నాయా వాటిని వదిలించుకోవడం చాల తేలిక. ఎలా అంటే ఉసిరి విత్తనాల్ని పొడి చేసి దాన్ని నిమ్మరసంలో కలపాలి. వెంట్రుకల మొదళ్లకు ఆ మిశ్రమాన్ని పట్టించి అరగంట తర్వాత స్నానం చేయండి. పేల బెడద మిమ్మల్ని వీడుతుంది.
16. పొడిబారిన కురులకు కొబ్బరినూనె, కొబ్బరిపాలు, పెరుగు తలా పావుకప్పు, ఒక గుడ్డులోని తెల్లసొన తీసుకుని, అన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ళకు ఇంకేలా పట్టించాలి. 20 నిమిషాల తర్వాత కడగేయాలి.
17. పొడిబారిపోయి కాంతిహీనంగా తయారైన జుట్టుతో బాధపడుతున్నట్లయితే, తాజా మెంతికూరను తీసికొని మెత్తగా రుబ్బుకోవాలి. దానికి చిక్కటిపెరుగు కలిపి తలకు పట్టించండి. అరగంట తర్వాత మంచి షాంపుతో తలస్నానం చేయండి. జుట్టు ఎంతో కోమలంగా తయారౌతుంది.
18. బలహీనంగా పల్చగా కనిపించే జుట్టు విషయంలో మరింత శ్రద్ద తప్పనిసరి. అందుకు బొప్పాయి, అరటిపండు ముక్కలు ఒక్కోకప్పు చొప్పున అరకప్పు యాపిల్ ముక్కలు తీసుకోవాలి. వీటన్నిటిని మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళుపోసి మెత్తగా రుబ్బాలి. ఈ గుజ్జును బాగా వడకట్టాలి. అలా వడకట్టగా వచ్చిన రసాన్ని తలంతా పట్టించండి. తర్వాత వెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
19. వెంట్రుకలు ఊడకుండా ఉండడానికి మెంతులను నీళ్ళతో సహా మెత్తగా రుబ్బి తలకు పట్టించి 40 నిమిషాల తరువాత కడిగేయాలి. దీనిని ప్రతిరోజు ఉదయం చేస్తే మంచిది. కనీసం మండలం (40 రోజులు) పాటు కొనసాగిస్తే చక్కని ప్రయోజనం కనిపిస్తుంది.
20. కేశ సౌదర్యం ద్విగిణీకృతం కావాలంటే పౌష్టికాహారం తీసుకోవాలని తెలుసు. అయితే ఎటువంటి ఆహారం తీసుకోవాలన్నదే చాలామందిలో తలెత్తే సందేహం. మీదీ ఇదే అభిప్రాయమైతే ఇది చదవండి. ఒక్కమాట... ఈ అహార ప్రణాళిక రూపొందించుకునే ముందు మీకు రక్తహీనత, ధైరాయిడ్, చుండ్రు సమస్యలు ఉన్నయేమో పరీక్ష చేయించుకోవడం మేలు.
21. రక్తహీనత వల్ల కూడా జుట్టు రాలుతుంది. జుట్టు రాలకుండా ఉండాలంటే ఇనుము సమృద్దిగా లభించే ఆహారం తప్పనిసరి. మాంసం, గుడ్డు, కీమా, తాజా ఆకుకూరలు, రాగులు, జొన్నలు, సజ్జలు, ఓట్స్, గోధుమలు, ఫిగ్స్, ఆప్రికాట్ తదితరాల ద్వారా ఇనుము పుష్కలంగా అందుతుంది.
22. అన్ని రకాల నిమ్మజాతి పండ్ల ద్వారా విటమిన్ 'సి' సమృద్ధిగా లభిస్తుంది. ఇనుము ఆధారిత ఆహారపదార్ధాలు తీసుకుంటున్న శాకాహారులు మాత్రం వాటితోపాటు విటమిన్ 'సి' ఉండే వస్తువులూ తప్పనిసరిగా తీసుకోవాలి.
23. దువ్వెన, హెయిర్బ్రష్ల బ్రిసిల్స్ పెళుసుబారినట్లు అనిపిస్తే వాడకం ఆపేయాలి, లేదంటే వెంట్రుకలు పాడైపోతాయి. దువ్వెనలను అధిక వేడి ఉన్న హెయిర్ డ్రయర్ సమీపాన ఉంచకండి, వేడికి దువ్వెన పళ్లు దెబ్బతింటాయి.
గంటకు మించి హెన్నా వద్దు
జుట్టుకు సంబంధించిన ఏ సమస్యకైనా హెన్నా లేదా గోరింటాకు బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా హెయిర్‌డైలు వాడే వారికి... పెర్మింగ్, స్ట్రెయిటనింగ్ చేయించుకున్నప్పుడు వాటిలోని రసాయనాల వల్ల జుట్టు, తల పొడిబారతాయి. చుండ్రూ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలన్నింటికీ హెన్నా దివ్యౌషధంలా పనిచేస్తుంది. అయితే, సరైన రీతిలో వాడితేనే ప్రయోజనాలు పొందగలుగుతాం.ముఖ్యంగా పచ్చిగోరింటాకు ముద్ద కాకుండా పొడిని వాడాలి. అలాగే అన్నివయసులవారూ హెన్నాను ఒకేరకంగా పెట్టుకోకూడదు. వయసును బట్టి దీనిని వాడాల్సి ఉంటుంది. ఎలాగంటే..
* యుక్తవయసువారు నెలకోసారి గంట చొప్పున.
* ఇరవై నుంచి ముప్ఫైఏళ్లలోపువారు ప్రతి పదిహేనురోజులకోసారి గంట చొప్పున.
* ముప్ఫైఏళ్లు దాటినవారు వారానికోసారి గోరింటాకు పెట్టుకోవాలి. అయితే ఓ వారం అరగంట, మరోవారం గంట.. ఈ క్రమంలో పెట్టుకుంటేనే సరైన ప్రయోజనాలు పొందవచ్చు.
* హెన్నాను గంటవ్యవధికి మించి పెట్టుకోకూడదు. అంతకు మించితే జుట్టు ఎండిపోయినట్లుగా తయారౌతుంది. నుదుటి పైముడతలూ ఏర్పడతాయి.
ఇంట్లో ఇలా...
* మృదువుగా...: రెండుకప్పుల హెన్నాపొడి, అరకప్పు ఉసిరికపొడి, చెంచా మెంతిపొడి, రెండుచెంచాల వేపాకుపొడి, రెండు నిమ్మకాయలు లేదా నాలుగుచెంచాల పుల్లటిపెరుగు, అరకప్పు టీ డికాక్షన్ తీసుకోవాలి. వీటన్నింటినీ కలిపి గంటపాటు నానినతర్వాత తలకుపెట్టుకోవాలి. ముప్పావుగంట తర్వాత తలస్నానం చేయాలి. పదిహేనురోజులకోసారి ఇలా చేస్తే చుండ్రు, తలలో దురద తగ్గి జుట్టు మృదువుగా మారుతుంది.
* మెరిసిపోయేలా: కప్పు హెన్నా, మందారఆకులపొడి, ఉసిరికపొడి, కలబందగుజ్జు (అలొవెరాజెల్) ఒక్కొక్కటి అరకప్పు చొప్పున, రెండుకోడిగుడ్లు (తెల్లసొనను మాత్రమే తీసుకోవాలి), రెండుచెంచాల కొబ్బరినూనె, రెండు నిమ్మకాయలు. గుడ్ల సొన తప్ప మిగతా పదార్థాలన్నింటినీ రెండుగంటల ముందే నానబెట్టుకోవాలి. తలకు పెట్టుకోబోయేముందు మాత్రమే సొనను కలపాలి. ఈ విషయాన్ని విస్మరించకూడదు. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లనుంచి పట్టించి ముప్పావుగంట తర్వాత తలస్నానం చేయాలి. నాలుగువారాలపాటు క్రమం తప్పకుండా ఇలా చేస్తే జుట్టు అందంగా నిగనిగలాడటం ఖాయం.
పార్లర్లో ఇలా..
జుట్టు మరీ పొడిబారి గడ్డిపీచులా ఉంటే...
* ఇన్ఫెక్షన్ తగ్గడానికి లేజర్ రేస్‌తో చికిత్స
* తలకు టానిక్ రాసి ఇన్ఫ్రారెడ్ రేస్‌తో మూడునిమిషాలు చికిత్స హెయిర్గ్రోత్ ఆయిల్ కలిపిన హెర్బల్ హెన్నాను తలకు రాసి ఆవిరి. లేదా హాట్టవల్ ట్రీట్మెంట్
* హెర్బల్షాంపూతో తలస్నానం...తర్వాత ఇన్టెన్స్ ప్రొటీన్ మాయిశ్చరైజింగ్ కండిషనర్ రాసి ఐదునిమిషాలయ్యాక కడిగేయాలి.
ఈ చికిత్స వల్ల ఎలాంటి సమస్యలున్నా తగ్గుతాయి. జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోతుంది.
చుండ్రు-సమస్యలు-నివారణ
చుండ్రు.. చిరకాల సమస్య! ఎంతోమంది నిత్యం దీనితో చికాకు పడటమే కాదు.. పైకి చెప్పుకోలేని న్యూనత కూడా అనుభవిస్తుంటారు. చుండ్రు చాలామందిలో ఉండొచ్చుగానీ.. ఇది ముఖ్యంగా యుక్తవయస్కుల్లో, యువతీయువకుల్లో 50-70% మందిలో కనబడుతుంటుంది. అందుకే దీన్ని ప్రధానంగా యువత సమస్యగా చెప్పుకోవచ్చు.
ఎందుకొస్తుంది?
సాధారణంగా మన చర్మకణాలు పాతవి పోతూ.. కింది నుంచి కొత్తవి వస్తుంటాయి. ఇది నిరంతరాయంగా జరుగుతుండే ప్రక్రియ. తల మీద కూడా చర్మం కణాలు కొత్తవి వస్తూ, పాతవి పోతూనే ఉంటాయి. సాధారణంగా పాత కణం ఒకటి పోయి కొత్తది రావటానికి 3-4 వారాలు పడుతుంది. మనం స్నానం చేసినప్పుడు పాతవి రాలిపోతుంటాయి కాబట్టి వీటి గురించి మనం అంతగా పట్టించుకోం కూడా. కానీ కొన్నిసార్లు రకరకాల సమస్యల వల్ల తల మీది కణాలు త్వరత్వరగా పాతవైపోతూ.. కొత్తవి వచ్చేస్తుంటాయి. దీంతో అక్కడ మృతకణాలు పేరుకుపోయి, అవి పొట్టుపొట్టుగా వూడివస్తుంటాయి. ఇదే 'చుండ్రు'. తల మీద వెంట్రుకలు, చమురు గ్రంథులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ పొట్టుకు చమురు కూడా తోడై తలంతా మరింత చికాకుగా తయారవుతుంది. అందుకే చుండ్రులో ప్రధానంగా రెండు రకాలుంటాయి. 1. పొడి రకం: వీరికి పొడి పొడిగా వెండిరంగులో పొట్టు రాలుతుంటుంది. 2. చమురు రకం: పొట్టుకు చమురు కూడా తోడై తల త్వరగా జిడ్డుగా తయారవుతుంటుంది.
చుండ్రు.. ఎందుకిలా?
1. తల మీది చమురు గ్రంథులకు చికాకు ఎక్కువై.. వాటి నుంచి చమురు (సీబం) ఎక్కువ ఉత్పత్తి కావటం ముఖ్య సమస్య.
2. యుక్తవయస్సులో మన ఒంట్లో హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీని ప్రభావంతో తల మీది చమురు గ్రంథులు ఎక్కువ పనిచేసి చమురును ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. మన తల చర్మం మీద ఉండే 'మాలస్సీజియా ఫర్ఫర్' అనే ఒక రకం ఫంగస్ ఈ చమురును విడగొట్టి 'ఓలియక్ ఆమ్లం'గా మారుస్తుంది. ఈ ఆమ్లం తల మీది చర్మాన్ని చికాకుపరుస్తుండటంతో కొత్త కణాలు ఎక్కువెక్కువగా పుడతాయి, వాటితో పాటే మృతకణాలూ పెరుగుతాయి. ఇవన్నీ తల మీద పేరుకుని.. పొట్టు రాలుతూ.. చుండ్రు ఆరంభమవుతుంది. దీనితో తల మీద కొద్దిగా వాపు, దురద కూడా ఆరంభమవుతాయి. గీరితే పొట్టు రాలి భుజాల మీద పడుతుంది. చాలామంది ఈ పొట్టు రాలిపడి భుజాల మీద మొటిమలు వచ్చాయనుకుంటారు. కానీ అది నిజం కాదు. మొటిమలు ఉండే వారిలో ఈ చుండ్రు కూడా ఎక్కువగా ఉంటుంది. యువతలో చుండ్రు సమస్యకు ఇదే ప్రధాన కారణం.
3. కొంతమందిలో జన్యుపరంగా కూడా చుండ్రు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
4. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కారణం: మానసిక ఒత్తిడి, ఆందోళన. ఇవి తీవ్రంగా ఉండే వారికి చుండ్రు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఒత్తిడి ఎక్కువైనప్పుడు చమురు గ్రంథులు ఎక్కువగా పనిచేసి చుండ్రు సమస్యకు ఆజ్యం పోస్తాయి.
5. షాంపూలు అధికంగా వాడటం, వాటిని సరిగా కడుక్కోకపోవటం.. దీనివల్ల ఆ రసాయనాలు తల మీది చర్మాన్ని చికాకుపరిచి.. కణోత్పత్తి పెరిగి చుండ్రు మొదలవుతుంది. అందుకే తల మీద సాధ్యమైనంత వరకూ రసాయనాలు, క్రీములు ఎక్కువగా వాడకూడదు. షాంపూ పూర్తిగా పోయేలా శుభ్రంగా కడుక్కోవాలి.
6. బలంగా ఒత్తిపెట్టి దువ్వటం, జుట్టుకు కర్లింగ్, డ్రైయర్‌తో వేడి చెయ్యటం వంటివాటివల్ల కూడా కణోత్పత్తి, చుండ్రు పెరుగుతాయి.
7. ఇంకా పూర్తిగా నిర్ధారణ కాకపోయినా.. మనం తినే ఆహారం కూడా చుండ్రుకు దారితీస్తుందన్న వాదన ఉంది. నూనె, మసాలా పదార్ధాలు ఎక్కువగా తీసుకునేవారికి చుండ్రు ఎక్కువన్న చర్చ ఉంది.
8. పార్కిన్సన్స్ వంటి న్యూరాలజీ సమస్యలుండే వారిలో కూడా చుండ్రు ఎక్కువగా ఉంటుంది. హెచ్ఐవీ బాధితులకూ చుండ్రు బాధ ఎక్కువ.
9. ఉన్నట్టుండి వాతావరణం చల్లబడటం, చలికాలాల్లో తల మీది చర్మం పొడిబారి.. దురద, దాంతోపాటే చుండ్రు పెరుగుతుంది.
10. బట్టతల ఉన్నవారిలో తల మీద ఆండ్రోజెన్ హార్మోన్ల ప్రభావం ఎక్కువుండి.. జుట్టు లేకున్నా చుండ్రు వేధిస్తుంటుంది.
11. స్త్రీలలో కంటే పురుషుల్లో చుండ్రు సమస్య ఎక్కువ. చమురు గ్రంథులు పురుషులకు ఎక్కువ, తల మీది గ్రంథులపై హార్మోన్ ప్రభావం కూడా పురుషుల్లో ఎక్కువ.
చికిత్స సాధ్యమేనా?
చుండ్రు అనేది మన శారీరక సహజ ప్రక్రియల్లో భాగంగా వచ్చే సమస్య కాబట్టి అందరికీ దీన్ని పూర్తిగా పోగొట్టటం సాధ్యపడకపోవచ్చు. కాకపోతే మానసిక ఒత్తిడి, షాంపూలు ఎక్కువగా వాడటం వంటి ఇతరత్రా కారణాల వల్ల వస్తుంటే వాటిని గుర్తించి పద్ధతులు మార్చుకోవటం ద్వారా పూర్తిగా తగ్గించుకోవచ్చు కూడా. మొత్తమ్మీద ఒకప్పటి కంటే ఇప్పుడు చుండ్రును తగ్గించుకునేందుకు మంచి షాంపూలు, చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి.
చుండ్రు ఒక మోస్తరుగా ఉంటే.. తరచుగా.. అంటే రోజు విడిచి రోజు మార్కెట్లో దొరికే సాధారణ 'యాంటీ డాండ్రఫ్' షాంపూలతో తలస్నానం చెయ్యటం మంచి మార్గం. 'జింక్ పైరిథియోన్' అనేది మార్కెట్లో దొరికే ప్రతి 'యాంటీ డాండ్రఫ్' షాంపూలోనూ ఉంటుంది. దీనికి ఫంగస్‌నూ, కొత్తకణాల పుట్టుకనూ తగ్గించే గుణం ఉంది. దీంతో కొంత మెరుగవుతుంది. వీటితో ఉపయోగం లేకపోతే అప్పుడు వైద్యుల సలహా మేరకు కొన్ని 'మెడికేటెడ్ షాంపూ'లను వాడాల్సి ఉంటుంది.
మెడికేటెడ్ షాంపూల్లో.. ఫంగస్‌ను తగ్గించేందుకు కీటొకొనజోల్, సైక్లోపైరాక్సి ఓలెమిన్ తదితరాలు కలిసిన షాంపూలు, చుండ్రు వ్యాప్తిని అడ్డుకునేందుకు కోల్తార్, శాల్సిలిక్ ఆమ్లం + సల్ఫర్, సెలీనియం సల్ఫైడ్ వంటివి కలిసిన షాంపూలు ఉన్నాయి. వీటిని ఉపయోగించవచ్చు. కీటొకొనజోల్ బయట లభించే షాంపూల్లో 1% ఉంటే మెడికేటెడ్ షాంపూల్లో 2% ఉంటుంది. ఈ 2% షాంపూలతో ఫలితాలు బాగుంటాయి.
దురద ఎక్కువగా ఉంటే షాంపూల రూపంలో ఉండే 'కార్టికో స్టిరాయిడ్'లను కూడా సిఫార్సు చేస్తారు. చుండ్రు చాలా ఎక్కువగా ఉన్నవారికి ఈ స్టిరాయిడ్ + కీటొకొనజోల్ కలిసిన షాంపూలున్నాయి. వీటిని సిఫార్సు చేస్తారు. దీంతో వాపు, ఫంగస్ రెండూ తగ్గుతాయి. చుండ్రు క్రమేపీ తగ్గుతుంది. వీటితో పాటు.. రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేసే టాక్రోలిమస్ వంటి ఆయింట్మెంట్లను రాత్రిపూట రాసుకుని ఉదయాన్నే స్నానం చేసినా ఉపయోగం ఉంటుంది.
* మెడికేటెడ్ షాంపూలను తలకు రాసుకుని.. వెంటనే కడిగేయకూడదు. జుట్టును తడిచేసి షాంపూ రాసిన తర్వాత కనీసం అది 5 నిమిషాలైనా ఉండి, అప్పుడు కడిగేసుకోవాలి. చుండ్రు ఓ మోస్తరుగా ఉంటే ఈ షాంపూలతో వారానికి రెండుసార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది. ఎక్కువగా ఉంటే రోజు విడిచి రోజు, మరీ తీవ్రంగా ఉంటే రోజూ కూడా చెయ్యచ్చు. అయితే ఇలా 15 రోజుల పాటు రోజూ తలస్నానం చేసిన తర్వాత క్రమేపీ తరచుదనాన్ని తగ్గించుకుంటూ.. వారానికి రెండు సార్లకు, చివరికి వారానికి ఒకసారికి రావాలి. ఒక్కసారిగా ఆపకుండా క్రమేపీ తగ్గించుకుంటూ రావటం ముఖ్యం. మొత్తమ్మీద ఈ మెడికేటెడ్ షాంపూలను ఆర్నెల్ల కంటే ఎక్కువకాలం వాడకూడదు. ఆ తర్వాత ఎప్పుడన్నా చుండ్రుగా అనిపిస్తే వాడొచ్చు.
నిర్లక్ష్యం చేస్తే మరీ నష్టం
చుండ్రు మరీ ఎక్కువగా విస్తరిస్తే కనుబొమలు, కను రెప్పలు, మీసాల దగ్గర, చెవి వెనక, ఛాతీ మీద.. ఇలా ఒంటి మీద చాలాచోట్ల ఆరంభమవుతుంది. రెండోది- దురదపెట్టినప్పుడు గోకితే.. మన చర్మం మీద సహజంగా ఉండే ఇతరత్రా సూక్ష్మజీవులు కూడా లోపలికి వెళ్లి వెంట్రుకల కుదుళ్లకు ఇన్ఫెక్షన్ (ఫాలిక్యులైటిస్) తెచ్చిపెడతాయి. దీంతో జుట్టు కూడా రాలుతుంది. సాధారణంగా చుండ్రు వల్లనే జట్టు రాలదుగానీ.. చుండ్రు ఎక్కువైపోయి వెంట్రుక కుదురు కూడా చికాకుకు గురైతే వెంట్రుకలు రాలిపోతాయి. అయితే తర్వాత ఇవి మళ్లీ వస్తాయి.
మొత్తానికి ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని దీనికి కచ్చితంగా చికిత్స తీసుకోవటం అవసరం.
పొట్టు అంతా చుండ్రు కాదు!
తల మీద పొట్టు ఒక్కచుండ్రు ఉంటేనే కాదు.. సోరియాస్ వంటి ఇతర సమస్యల్లోనూ కనబడుతుంది. అక్కడక్కడ కొంతకొంత భాగం దట్టమైన పొలుసులు వస్తూ.. గీరితే తెల్లటి పొట్టు వస్తుంటే దాన్ని సోరియాసిస్‌గా అనుమానించవచ్చు, ఈ సమస్యకు దురద ఉండదు. ఇక చుండ్రు ఒక్కచోటే ఉండదు. తలంతా పొట్టు రాలుతుంటుంది, దురద కూడా ఉంటుంది. కొందరు ఆడపిల్లలకు తలలో పేలుండి, ఆ పేల వల్ల కూడా చుండ్రు పెరగొచ్చు. తల మీద బొబ్బలు వస్తూ అవి చితికి ఎర్రటి పుండ్లతో వచ్చే 'ఫెంఫిగస్ ఫోలిగస్' కూడా చుండ్రులా అనిపించవచ్చు. చిన్నపిల్లల్లో తలమీద ఫంగల్ ఇన్ఫెక్షన్లువచ్చి చుండ్రులా అనిపించవచ్చు. కాబట్టి తల మీద ప్రతి సమస్యా చుండ్రే అనుకోకూడదు.
చిట్కాల చిట్టా
చుండ్రుకు ఇంటింటి చిట్కాలు చాలా ఉన్నాయి. ఇవి అందరికీ పనిచేస్తాయని చెప్పలేంగానీ వీటితో నష్టమైతే ఉండదు. ఎవరికి ఏవి పనిచేస్తాయో వాడుకుని చూస్కోవాల్సిందే!
* కొద్దిగా గోరువెచ్చటి నీటిలో రెండు చెంచాల నిమ్మరసం కలిపి దాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత కుంకుడు లేదా సీకాకాయలతో తలస్నానం చెయ్యచ్చు.
* పులిసిన పెరుగు, గుడ్డుసొన కలిపి తలకు పట్టించి తర్వాత స్నానం చెయ్యచ్చు.
* ఆపిల్ వెనిగర్‌ను 1 : 3 నిష్పత్తిలో నీటితో పల్చన చేసి తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చెయ్యచ్చు.
* గోరువెచ్చ చేసిన నూనెను తలకు పట్టించి తర్వాత స్నానం చెయ్యటం ఫలితాన్నివ్వచ్చు.
* ఆస్ట్రేలియాలో ఉండే 'టీ ట్రీ ఆయిల్' ఇటీవలి కాలంలో మనకూ దొరుకుతోంది. 5% గాఢతతో లభించే దీన్ని రాసుకుని అరగంట తర్వాత స్నానం చెయ్యచ్చు.
* ఉసిరి, మెంతులు కూడా వాడొచ్చు. ఒకసారి మందులతో చుండ్రును నియంత్రించుకున్న తర్వాత ఇటువంటి చిట్కాలు పాటించటం ద్వారా మళ్లీ రాకుండా చూసుకోవటం మంచిది.
చుండ్రు వద్దనుకుంటే జీవనశైలి మార్చుకోవాలి.
*మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి.
*తరచూ తల స్నానం చెయ్యాలి.
*గాఢమైన షాంపూలు వాడకూడదు.
*తలకు క్రీములు, స్త్టెలింగ్ వంటివి తగ్గించాలి.
*తలకు అప్పుడప్పుడు సూర్యరశ్మి తగలటం మంచిది.
*తాజాపండ్లు, మంచి పోషకాహారం తీసుకోవాలి.
*పొడి రకం చుండ్రు ఉన్నవాళ్లు చలికాలంలో, మిగతా సీజన్లలో కూడా తలకు నూనె రాసుకోవచ్చు. వేసవిలో అవసరం లేదు. జిడ్డు రకం చుండ్రు ఉన్నప్పుడు మాత్రం తలకు నూనె పెట్టటం అంత మంచిది కాదు. దీనివల్ల తల మరింత చికాకు అనిపించి.. చుండ్రు బాగా పెరుగుతంది.
పసిబిడ్డల్లోనూ చుండ్రు
పసిబిడ్డలకూ చుండ్రు రావచ్చు. గర్భసమయంలో తల్లి నుంచి వచ్చిన హార్మోన్ల ప్రభావం కారణంగా, అటోపిక్ ఎగ్జిమా కారణంగాచుండ్రు రావచ్చు. దీన్నే 'క్రేడిల్ క్యాప్' అంటారు. ఏడాది తర్వాత ఇది పోతుంది. వీరికి బేబీ షాంపూలు, బిటాడిన్ యాంటీ డాండ్రఫ్ షంపూల వంటివి జాగ్రత్తగా వాడాలి.
* అయితే పసిపిల్లల్లో ఇలా చుండ్రుతో పాటు విపరీతమైన నీళ్ల విరేచనాలు, ఒళ్లంతా ఎర్రటి మచ్చలు, ఎదుగుదల సరిగా లేకపోవటం వంటి సమస్యలు కూడా కనబడితే రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన సమస్యలేమైనా ఉన్నాయేమో తప్పనిసరిగా వైద్యులకు చూపించాలి.
అపోహల పుట్ట
అపోహ: చుండ్రు ఒకరి నుంచి మరొకరికి అంటుకునే వ్యాధి కాదు. ఒకరి దువ్వెనల ద్వారా మరొకరికి వ్యాపించదు. (అయినా అది మంచి అలవాటు మాత్రం కాదు)
అపోహ: రోజూ షాంపూలతో స్నానం చేస్తే చుండ్రు తగ్గిపోతుందన్నది సరికాదు. షాంపూలన్నీ రసాయనాలు. మన తల మీది చర్మానికి రోజూ ఈ రసాయనాలు తగలటం మంచిది కాదు. దీనివల్ల కూడా తల మీది చర్మం చికాకుకు గురై.. చుండ్రు మరింత పెరుగుతుందని గుర్తించాలి.