Wednesday, 1 April 2009

లావు కావటం ఎలా?



స్థూ
లకాయం.. పెద్ద సమస్యే. అలాగని ఎంత ప్రయత్నించినా లావు కాని వారి మాటేమిటి. ఇది కూడా సమస్యే. బాగా సన్నగా, ఎంత తిన్నా, ఎంత ప్రయత్నించినా బరువు పెరగని వారి మాటేమిటి?
బాగా లావుగా ఉండటం ఒక్కటే అనారోగ్యం కాదు, మరీ సన్నగా ఉండటం కూడా అనారోగ్యమే. స్థూలకాయం, అధిక బరువుపైనే ప్రస్తుతం ప్రపంచంలో అందరి దృష్టీ ఉండటంతో బరువు తగ్గటానికి ప్రయత్నించేవారేగానీ, పెరగాలని అనుకునే వారు తక్కువే. అంతేకాకుండా.. స్థూలకాయంలో బోలెడన్ని సమస్యలు కనిపించటం వల్ల తగ్గాలని కోరిక పెరగటం, సన్నగా ఉండేవారిలో ఎక్కువ సమస్యలు లేకపోవటంతో తక్కువ బరువు ఉండటం ఆరోగ్యకరమేననే భావన బలపడుతోంది. అయితే.. బరువు మరీ తక్కువగా కూడా కాకుండా ఆరోగ్యకర స్థాయిలో ఉండాలని నిపుణులు అంటున్నారు.

బరువు తక్కువగా ఉండటానికి ఎన్నో కారణాలు తోడవుతాయి. తినటంలో సమస్యల నుంచి దీర్ఘకాలిక జబ్బులదాకా ఏవైనా కారణం కావచ్చు. వృద్ధులు మామూలుగానే సన్నగా మారతారు. బాగా సన్నగా ఉండేవారిలో గుండె వైఫల్యం, క్యాన్సర్‌ వంటి జబ్బులతో మరణించే అవకాశాలు పెరుగుతాయి.

ఆరోగ్యకరంగా బరువు పెరగటం ఎలా?
ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగటానికి.. ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా మరింత అదనపు క్యాలరీలు పొందేలా చూసుకోవాలి. సరైన వ్యాయామాల్ని ఎంచుకోవటమూ ముఖ్యమే. అయితే.. మనకు ఎన్ని క్యాలరీలు అవసరమనేది నిర్దిష్టంగా తెలియకపోవచ్చు. బరువు పెరిగిందుకు కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు, జంక్‌ఫుడ్‌ అధికంగా తీసుకోవటం వల్ల ఫలితం ఉండదు. జంక్‌ఫుడ్‌లో అనారోగ్యకరమైన ట్రాన్స్‌ఫ్యాట్స్‌, సంతృప్త కొవ్వు పదార్థాలు ఉంటాయి. అందుకని, ఆరోగ్యాన్ని అందించే ఆహార పదార్థాల నుంచే క్యాలరీల్ని పొందాలి.

ఆరోగ్యకరమైన కొవ్వులంటే.. చేపల్లో లభ్యమయ్యే ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు తీసుకోవచ్చు. ఇవేకాకుండా మాంసకృత్తులు అధికంగా లభ్యమయ్యే మాంసం, చేపలు, చికెన్‌ గింజలు, వేరుసెనగ, పప్పు ధాన్యాల్ని తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాల నుంచి ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు లభిస్తాయి. ఆహార పదార్థాల నుంచే కాకుండా అవసరమైతే సప్లిమెంట్లు కూడా అదనంగా తీసుకోవచ్చు.

సరైన ఆహారం: ఎంచుకునే ఆహారం కేవలం కేలరీలు ఇచ్చేది మాత్రమే కాకుండా అవసరమైన పోషకాలనూ అందించాలి. పోషకాలతోపాటు అదనపు క్యాలరీలూ ఉండాలి. శరీరానికి శక్తిని అందించటంలో పిండి పదార్థాలదే కీలకపాత్ర. వీటితోపాటు అవసరమైతే కొన్నిసార్లు కొవ్వు, మాంసకృత్తుల నుంచి కూడా శరీరం శక్తిని పొందుతుంది. బరువు పెరగాలనుకునేవారు అవసరమైనంతగా పిండి పదార్థాలు లభ్యమవుతున్నాయా అనేదీ గమనించాలి. పిండిపదార్థాలు సమృద్ధిగా లభ్యమవ్వాలంటే.. పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు తీసుకోవటం మంచిది.

ఏ తరహా ఆరోగ్యకరమైన ఆహారంలోనైనా పండ్లు, కూరగాయలదే ముఖ్యపాత్ర. కేలరీలు తక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో కొన్నిరకాల కూరగాయలకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. వీటిలో పోషకాల సంఖ్య అధికం. క్యాలరీలు తక్కువగా ఉండే కూరగాయలకు ఆలివ్‌నూనె వంటివాటిని జత చేయటం ద్వారా వాటి క్యాలరీల సంఖ్యను పెంచవచ్చు.ఆలుగడ్డ, మొక్కజొన్న వంటి వాటిలో క్యాలరీలు అధికంగా లభ్యమవుతాయి. కూరగాయలతోపాటు పండ్లు కూడా బాగా తినాలి. పండ్లలో విటమిన్లు, ఫ్లేవనాయిడ్స్‌ వంటి ఫైటోకెమికల్స్‌ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. తాజా పండ్లతో స్నాక్స్‌ చేసుకుని తినటం ద్వారా మంచి ప్రయోజనం పొందవచ్చు. పిండి పదార్థాలు ఇచ్చే ఆహార పదార్థాల్లో పప్పు ధాన్యాలు కూడా కీలకమైనవి.

వ్యాయామం కూడా అవసరమే: ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగటానికి కేవలం ఆహారం పైనే ఆధారపడకుండా, చక్కని వ్యాయామం చేయటం కూడా అవసరం. రెసిస్టెంట్‌ ట్రైనింగ్‌గా పిలిచే బరువులు ఎత్తటం వంటి వ్యాయామాలు చేయటం ద్వారా కండరాల్ని శక్తిమంతం చేయవచ్చు. వీటితోపాటు రన్నింగ్‌ వంటి ఏరోబిక్‌ వ్యాయామాలు చేయవచ్చు.